ఆపరేషన్ కృష్ణా జిల్లా…ఆ ముగ్గురిపై వైసీపీ స్కెచ్

-

పార్టీని వీడి టీడీపీలో చేరిన నేతలను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది.ఇటీవల ఈ జిల్లాలో అధికార వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు పార్థసారధి, వసంతకృష్ణ ప్రసాద్,ఎంపీ బలసౌరి లను టార్గెట్ చేసింది వైసీపీ. పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించినప్పటికీ సీఎం జగన్ ని కాదని టీడీపీలోకి వెళ్లారు ఈ ముగ్గురు. అందుకే ఆ ముగ్గురిని ఈసారి ఎన్నికల్లో ఓడించి చట్టసభలకు వెళ్లకుండా ఉండేలా వ్యూహరచన చేస్తోంది వైసీపీ దళం. వైసీపీ నుంచి ఎందుకు వచ్చేసాం అని పశ్చాత్తాప పడేలా చేయాలన్నదే ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్న లక్ష్యం. ఈ ముగ్గురు సీఎం జగన్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడాన్ని వైసీపీ వర్గాలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అందుకే వారి ఓటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

వైసీపీని వదిలి టీడీపీ-జనసేన కూటమి తరపున బరిలోకి దిగుతున్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశారి, మాజీ మంత్రి, నూజివీడు అభ్యర్థి కొలుసు పార్థసారథి, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లాలోని మైలవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాలతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదట అసమ్మతి గళం వినిపించిన పార్థసారథి పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బరిలోకి దిగుతున్నారు. అయితే పార్థసారథిని ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇన్ చార్జ్ గా పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన సీఎం జగన్ను కలిశారు. ఇప్పుడు ఆయన్ను టీడీపీ రెబెల్ గా బరిలోకి దించితే టీడీపీ ఓట్లు భారీగా చీలిపోతాయి. దీంతో పార్థసారథి ఓటమి ఖాయం అంటున్నారు.

మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేయిన విషయం తెలిసిందే. మంత్రి జోగి రమేష్ తో విభేదించి ఆయన వైసీపీని వదిలేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థి కూడా అతనే. అనేక అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వచ్చారు వసంత. ఆయనకి పోటీగా యాదవ వర్గానికి చెందిన జడ్పీటీసీ సర్నాల తిరుపతి రావును వైసీపీ బరిలోకి దించుతోంది. వసంతను ఓడించే బాధ్యతలను కొందరు సీనియర్ నేతలకు సీఎం జగన్ అప్పగించారు.

వైసీపీని వీడిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును బలసౌరి పై పోటీకి పెట్టారు సీఎం జగన్. బాలసౌరీ ఓడించి తీరాలని వైసీపీ అధిష్టానం పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.అలాగే మిగతా జిల్లాలో కూడా వైసీపీని వీడిన వారిని టార్గెట్ చేస్తూ ఓడించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version