ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనాభా కంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఎక్కువగా ఉండడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. సంక్షేమ పథకాల పేరిట తరచూ బటన్ నొక్కానని పేర్కొనే జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లేని అరకోటి కుటుంబాలకు రేషన్ ఇచ్చామని చెప్పుకుంటున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం 75 లక్షల కుటుంబాలకు రేషన్ సరఫరా చేస్తుండగా, అదనంగా మరో 45 లక్షల కుటుంబాలకు తామే రేషన్ సరఫరా చేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని, ఒక ఇంటికి సగటున మూడున్నర మంది చొప్పున వేసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని దారిద్ర రేఖ దిగువన ఉన్న ప్రజలకు సరిపోతుందని, మరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నామని చెబుతున్న రేషన్ ఎక్కడకు వెళ్తోందని ఆయన ప్రశ్నించారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెట్టిన వైనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయనకు సుదీర్ఘమైన లేఖ రాసినట్లు రఘురామకృష్ణ రాజు వివరించారు.