తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్యతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం మాటలకే పరిమితమని అన్నారు. ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి ఆమ్ బజార్, బుగ్గ వాగు కొత్త బస్టాండ్ గోవింద్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ జగదాంబ సెంటర్ వరకు భారీ ప్రదర్శన కార్యక్రమంలో ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తలతో కలిసి నడిచారు.
అనంతరం జగదంబ సెంటర్ వద్ద గల తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని, రానున్న ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను తమ సొంత జాగిరులుగా భావించడం సరికాదని, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం, అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేపించుకోవడం అలవాటుగా మారిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, అమలు చేస్తున్నట్టు ప్రచారం చేయడంలో మాత్రం సఫలం చెందిందని అన్నారు. ఎన్నికల కాలంలో కేసీఆర్ సరికొత్త పథకాలకు శ్రీకరం చుడతారని, కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం శ్రద్ధ వహించరన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ప్రజలకు అర్థమైంది అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్…4000 రూపాయల పెన్షన్, అర్హులైన రైతులకు పట్టాల పంపిణీ, వాటికి రుణాలు, ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేర్చడమే లక్ష్యం అన్నారు.