తెలంగాణలో జరిగిన గ్రామ సభల్లో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టారని, కావాలనే వారిని తప్పుదోవ పట్టించారని.. ప్రజలు గులాబీ పార్టీ ట్రాపులో పడొద్దని మంత్రి సీతక్క సూచించారు. ఇకనైనా గులాబీ లీడర్లు చిల్లర వేషాలు మానుకోవాలని హితవు పలికారు.
శనివారం మంత్రి సీతక్క వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పథకాలపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తున్నారని, అదే పనిగా వారిని రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ..అలా చేయడం సరికాదని ఆమె సీరియస్ అయ్యారు రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని, ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు.