హైదరాబాద్: బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూర్చున్న సీటు ముందూ, వెనుక మూడు వరుసల్లోని వ్యక్తులను గుర్తించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు ఇప్పటివరకు ఏడు విమానాలు ల్యాండ్ అవ్వగా.. 5 విమానాల్లో ప్రయాణించిన 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
బ్రిటన్ లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని గతేడాది డిసెంబర్ చివరన కేంద్ర ప్రభుత్వం విమానాలను రద్దు చేసింది. తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి విమానాలను ప్రారంభించింది. రద్దీని బట్టి వారానికి ఒకటి నుంచి రెండు విమానాలను బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థ లండన్ లోని హిత్రో విమానాశ్రయం నుంచి హైదరాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడుపుతోంది. అయితే విమానంలో ప్రయాణించే ప్రయాణికులు 72 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. నెగిటివ్ వస్తేనే వారిని ప్రయాణానికి అనుమతిస్తారు. కానీ 5 విమానాల్లో 15 మందికి కరోనా ఉన్నా.. ఎలా అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది.
గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలింపు..
ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ వచ్చిన వారికి ఇంటికి పంపించి.. 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాలని వైద్యులు సూచించారు. అయితే వీరిలో కొందరికి బ్రిటన్ లో టెస్టులు చేయించుకున్నప్పుడు నెగిటివ్ వచ్చి.. హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే నాటికి పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. దీంతో పాజిటివ్ వచ్చిన 15 మందిని గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించారు. వీరితో ప్రయాణించిన 270 మందిని హోం క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
బ్రిటన్ లేదా వేరే దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పరీక్షలు నిర్వహించినప్పుడు ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం ఎదురవుతోందని బాధితులు చెబుతున్నారు. పరీక్షలు ఉదయం నిర్వహిస్తే.. ఫలితాలు సాయంత్రం వెల్లడిస్తున్నారని వాపోతున్నారు. దీని వల్ల ఆ పరీక్షా కేంద్రంలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉంటున్నామని బాధితులు చెబుతున్నారు.