ఆత్మహత్య ఆత్మహత్యే సర్..అది చంద్రబాబు హయాంలో జరిగినా, జగన్ హయాంలో జరిగినా.. మరి ! మీరెందుకు ఆ విధంగా ఆప్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారు అని జనసేన ప్రశ్నిస్తోంది. వీలున్నంత వరకూ ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి వెళ్తోంది. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ! అని రాశారు కదా! అదే నిజం ! జగన్ స్పందించారు..సీఎం గారూ ! మీకు థాంక్స్ అండి అని అంటున్నాయి విపక్షాలు మరియు బాధిత వర్గాలు.
పవన్ కల్యాణ్ గారూ మీరు మా ఊరు రావాలి.. మీరు వచ్చేందుకు అయ్యే ఖర్చును నేనే భరిస్తా అని ఉమ్మడి అనంతపురం జిల్లా వివాదస్పద నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటి వేళ వ్యాఖ్యానించారు. అది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. పవన్ కు సమస్యలపై స్పందించడం చేతగాదు అని వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఇది సరైన సమయమా కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారు.. విత్తనాలు నాటితే వరి వృక్షాలు వస్తాయని భావించే వాళ్లంతా రైతుల గురించి మాట్లాడేవారే అని హేళన చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమే పునరాలోచనలో పడింది.
“2019 జూన్ నుంచి 2022 మార్చి వరకూ మీ మీ ప్రాంతాలలో ఎవ్వరైనా రైతులు కానీ కౌలు రైతులు కానీ చనిపోయారా ” అని వలంటీర్లను అడుగుతోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వెంటనే పంపాలని కోరుతోంది. ఆత్మహత్యల సమాచార గణాంకాలు వెనువెంటనే తీసుకోవాలి అని వలంటీర్ వ్యవస్థనూ, గ్రామ సచివాలయ సిబ్బందినీ ఆదేశిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది జనసేన విజయం. సమస్య ఉన్న ప్రతిచోటా పవన్ ఉంటారు అని చెప్పేందుకు తార్కాణం.
“నేనేమీ గొప్ప పని చేస్తున్నానని అనుకోవడం లేదండి. నాకున్న డబ్బులలో నేను సంపాదించిన డబ్బులలో సినిమా ద్వారా వచ్చిన డబ్బులలో ఓ ఐదు కోట్లు కేటాయించి వీళ్లను ఆదుకోవాలని నిర్ణయించాను. ఇందులో నేను చేసింది ఏం లేదు ” అని అన్నారు పవన్. ఇప్పటికీ రెండు జిల్లాలలో ఆయన కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించారు. ఒకటి అనంతపురంలోనూ రెండు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ.. చెప్పిన విధంగానే బాధిత కుటుంబాల వివరాలను స్వచ్ఛంద సేవా సంస్థల సాయంతో సేకరించి, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందించి ఆదుకున్నారు.
దటీజ్ పవన్. ఆ రోజు అనంతపురంలో పవన్ చెప్పిన విధంగానే కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి డేటా ప్రభుత్వం దగ్గర లేదు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల వద్ద కూడా లేదు. వ్యవసాయం భారం అయి అప్పులు తీరక, ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేక ప్రాణాలు విడిచిన, బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే ! నిబంధనలను అనుసరించి ఒక్కో కుటుంబానికి ఏడు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ రోజు అనంత పర్యటన కు పవన్ వస్తున్నారని తెలియగానే బాధితుల సమాచారం సేకరించడం వెంటవెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవడం వంటివి సంబంధిత అధికారులు చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న వారి వివరాలు తెలుసుకుని, పవన్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా జగన్ తనదైన శైలిలో పరిహారం అందించేందుకు సిద్ధం కావడం నిజంగానే ఓ శుభ పరిణామం.