ప్రకాశం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ, రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని… కరువు జిల్లా గొంతు కోయొద్దని వేడుకుంటున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ను ఎడారిగా మారుతుందని కోరుకుంటున్నామని… పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్ పైనే ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు.
15 ఏళ్లలో మూడు సంవత్సరాలు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని.. ప్రకాశం జిల్లాలో మిగిలిన పన్నెండేళ్ళు కరువేనన్నారు.. మీరు తీసుకున్న నిర్ణయాలతో మరింత చేటు చేసేలా ఉందని… శ్రీశైలం నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు.. సాగర్ నిండితేనే ప్రకాశం జిల్లాకు నీళ్లు వస్తాయని పేర్కొన్నారు. శ్రీశైలం నిండకుండా మీరు, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే… ప్రకాశం జిల్లావాసుల పరిస్థితి ఏమిటి ? అని ప్రశ్నించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంతో మా కరువు జిల్లా పరిస్థితి ఏమిటని.. రాయలసీమ ఎత్తిపోతల 44 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కుల పెంపు పునరాలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ ను దగ్గుబాడు వరకు పొడిగించి ప్రజల దాహార్తిని తీర్చే, పంటలకు సాగునీరు ఇవ్వాలన్నారు. 2014 -19 మధ్య పురోగతి సాధించిన వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని పేర్కొన్నారు. టిడిపి హయాంలో చంద్రబాబు ముందుచూపుతో మొదలుపెట్టిన అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ కుడి కాలవకు గోదావరి జలాల తరలింపు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.