బోనాలు ప్రత్యేకం.. బోనాల పండగ విశిష్ఠత..

-

జగత్తును కాపాడే మహంకాళి అమ్మవారిని మనసారా పూజించే పండగ ఇది. మన పండగల్లో ఎక్కువ భాగం ప్రకృతి ఆరాధనతో వున్నవి కావడం విశేషం. ప్రకృతి ఆరాధనతో పాటు శక్తి పూజించడం తరతరాలుగా వస్తుంది. . బోనమంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్నే బోనం అంటారు. దక్షిణాయాన ప్రారంభ కాలంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామదేవతలకు బోనం సమర్పించి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు.

హైదరాబాద్ నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. అన్నం అంటే కేవలం మనం తినే బియ్యంతో వండినదే కాదు పండ్లు, కాయలు, ఆకులు, ఇలా అన్ని రకాల జీవులు బతుకడానికి ప్రాణసమానమైన ఆహారం. అలాంటి ఆహారాన్ని అమ్మవారు మనకు ఇస్తుంటారు. అందుకు కృతజ్ఞతగా ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం. ఆషాఢమాసంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతల ఆలయాలు నూతన శోభను సంతరించుకుంటాయి.

గోల్కొండ కోటతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ, శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయం, లాల్‌ధర్వాజా సింహవాసిని ఆలయం… తదితర ఆలయాల్లో జరిగే సంబరాలు అంబారాన్ని తాకుతాయి. ఘటోత్సవం అంటే కలశంలో అమ్మవారికి స్వాగతం పలకడం. పూర్ణకుంభంతో స్వాగతం పలకడాన్ని మనం చూస్తుంటాం. అమ్మవారికి కలశంతో స్వాగతం పలికితే అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ఆహారపదార్థాలు తయారుచేసి ఫలహారంబండిలో వేడుకగా ఆలయానికి తీసుకువెళుతారు. కొత్తకుండలో బియ్యం, పసుపు, బెల్లం, పాలు కలిపి ఆ కుండకు సున్నం పూసి వేపకొమ్మలు కట్టి తలపై పెట్టుకొని వూరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ వేడుకల్లో పోతురాజుల ప్రదర్శన విశేషంగా ఆకర్షిస్తుంది.

బోనాల చివరి రోజుల్లో భవిష్యవాణి రంగం కార్యక్రమానికి విశేష ఆదరణ ఉంటుంది. కాకతీయుల కాలం నుంచే బోనాల వేడుకలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కాకతి దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సమర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. ఏటా జరిగే బోనాల ఉత్సవాలు సమైక్య జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి. జంటనగరాల్లో ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహిస్తారు. అనంతరం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బోనాలు నిర్వహిస్తుంటారు. ఈ బోనాలను అత్యంత రంగరంగ వైభవంగా నిర్వహించడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయనేది పెద్దల అభిప్రాయం.

వాతావరణంలో వచ్చే మార్పులను అస్వాదిస్తూ దానివెంటే వచ్చే రోగాలను తట్టుకునేలా సంప్రదాయాన్ని కలబోసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. బోనాల్లో ఎక్కువగా ఉపయోగించే పసుపు, వేపఆకు తదితర పదార్థాలు అన్ని విషపూరిత జీవులు, పదార్థాల నుంచి మనల్ని రక్షిస్తాయనడంలో సందేహం లేదు. సంపదలకు అతీతంగా పేద, ధనిక అన్ని వర్గాల వారు అత్యంత భక్తితో చేసుకునే ఈ పండుగల్లో సామరస్యం, ఆత్మీయత, ప్రేమలు విరబూస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
ఇక ఆలస్యమెందుకు ఈసారి గోల్కండలో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కండి.

జై శ్రీమాతా!

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version