ప్ర‌త్తిపాటి సైలెంట్ పాలిటిక్స్‌… పేట‌లో కొత్త వ్యూహం..!

-

రాజ‌కీయాల్లో దూకుడు ముఖ్య‌మే. పార్టీల‌కు అతీతంగా నేడు అనేక మంది నాయ‌కులు దూకుడు రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా ఉన్నారు. మాట‌ల‌తోనో.. చేత‌ల‌తోనో.. నాయ‌కులు దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించి, గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పిన ప్ర‌త్తిపాటి పుల్లారావు.. రాజ‌కీయాలు మాత్రం దీనికి భిన్నంగా మారాయ‌నే ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఓట‌మిపాల‌య్యారు ప్ర‌త్తిపాటి. కొన్నాళ్లు దూకుడుగానే ఉన్నా.. త‌ర్వాత ఆయ‌న మౌనం పాటిస్తున్నారు.

ఎక్క‌డా ముందుకు రావ‌డం లేదు. పైగా ఆయ‌న ఎవ‌రినీ కూడా విమ‌ర్శించ‌డం  లేదు. వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు క‌నుక అధికార ప‌క్షం నేత‌ల‌పై దూకుడు చూపుతార‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా ప్ర‌త్తిపాటి ఉన్నారు. దీంతో కేడ‌ర్‌లో సందేహాలు ముసురుకున్నాయి. అస‌లు ఏంజ‌రిగింది ? ఎందుకు ఇలా చేస్తున్నారు ? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్తిపాటి అనుచ‌రులు చెబుతున్న విష‌యం ఏంటంటే పుల్లారావు.. ఆలోచ‌నాత్మ‌క ధోర‌ణితో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. త‌న రాజ‌కీయం తాను చేయ‌డంతో పాటు అధికార పార్టీలో జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను కూడా ఆయ‌న నిశితంగా ప‌రిశీలిస్తున్నార‌నే అంటున్నారు.

ప్ర‌స్తుతం చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ దూకుడుగా ఉన్నారు. సొంత పార్టీలోనే ఆమె నేత‌ల‌పై దూకుడు చూపిస్తున్నారు. ఇక్క‌డ ఆమెకు టికెట్ ఇచ్చి.. పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతోపాటు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విడ‌ద‌ల ర‌జ‌నీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. మొత్తంగా ఆమె గెలుపులో బాగానే కృషి చేశారు. అయితే.. ఆమె మాత్రం మ‌ర్రిని ప‌క్క‌న పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు పోటీ అవుతాడ‌ని అనుకుందో ఏమో.. వివాదాలే కేరాఫ్‌గా ముందుకు సాగుతున్నారు. ఇక‌, న‌ర‌స‌రావుపేట ఎంపీతోనూ వివాదాలు కొనితెచ్చుకుని దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పార్టీలోనే ర‌జ‌నీకి వ్యతిరేకంగా అనేక మంది శ‌త్రువులు రెడీ అవుతున్నారు.

తాను కాబోయే మంత్రినంటూ.. ఆమె ప్ర‌చారం చేసుకుంటున్నారు. భారీ ఎత్తున హోర్డింగులు పెట్టించుకుంటున్నారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. దీనికి తోడు రాజ‌ధాని మార్పు ప‌రిణామాలు కూడా పేట ప్ర‌జ‌ల‌పై భారీగా ప్ర‌భావం చూపాయి. దీంతో వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ప్ర‌త్తిపాటి పుల్లారావు.. వైసీపీ గ్రాఫ్‌ను డౌన్ చేయడానికి ప్ర‌య‌త్నం లేకుండా వారంత‌ట వారే చేసుకుంటున్నారని అంటున్నారు. అదే స‌మ‌యంలో వ‌చ్చే స్థాని క ఎన్నిక‌ల నాటి వ‌రకు వేచి చూసే ధోర‌ణిని అవ‌లంబిస్తున్నారు. ఆ త‌ర్వాత విజృంభించాల‌ని భావిస్తున్న‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి సింహం నాలుగు అడుగులు వెన‌క్కి వేసినా.. వ్యూహం మాత్రం గ‌ట్టిగానే ఉంటుంద‌ని అంటున్నారు.. మ‌రి పుల్లారావు కూడా అదే త‌ర‌హాలో దూకుడు చూపించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version