నా దేవుడిపై ప్రేమను బీజేపీగా మల్చకండి.. ట్రోల్స్‌కి ధీటుగా ప్రీతి జింటా రిప్లై

-

బాలీవుడ్ అందాల నటి ప్రీతి జింటా తాజాగా సోషల్ మీడియా వేదికపై తన అభిమానికి క్షమాపణలు చెబుతూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆమె నిర్వహించిన “Ask Me Anything” సెషన్‌లో బీజేపీలో చేరుతారా అని అడిగిన ప్రశ్నపై మొదట ఆమె కాస్త ఆగ్రహంగా స్పందించగా, తర్వాత రోజు చల్లబడి స్పందిస్తూ క్షమాపణ తెలిపింది. ప్రీతిని ఒక అభిమాని ఆమె రాజకీయ ప్రవేశం, ముఖ్యంగా బీజేపీలో చేరే ఆలోచనలపై ప్రశ్నించగా, “గుడికి వెళ్లడం, కుంభమేళాలో పాల్గొనడం, నా భారతీయతపై గర్వపడడం వంటివి నన్ను బీజేపీతో ముడిపెట్టలేరు” అంటూ ఘాటుగా బదులిచ్చింది. విదేశాల్లో ఉంటున్నప్పటికీ, తాను భారతీయ మూలాల పట్ల గౌరవం కలిగి ఉన్నానని పేర్కొంది.

అయితే, ఆ స్పందన దురుసుగా ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా, మరుసటి రోజు ప్రీతి జింటా మరో ట్వీట్ చేశారు. “నా సమాధానం కాస్త కఠినంగా అనిపించి ఉంటే క్షమించండి. ఆ ప్రశ్న వల్ల నాకు PTSD లాంటి భావోద్వేగాలు కలిగాయి. మీ స్పష్టతను అభినందిస్తున్నాను,” అంటూ వివరణ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితాన్ని వెల్లడిస్తూ, “నా భర్త ఆజ్ఞేయవాది అయినా, మేము మా కవల పిల్లలను హిందూ సంప్రదాయాల ప్రకారం పెంచుతున్నాం. కానీ దీనిపైనా విమర్శలు వస్తుండటం బాధాకరం. నా మతం, మూలాల గురించి పిల్లలకు నేర్పడంలో నేను గర్వపడుతున్నాను. అయినా, దాన్ని రాజకీయం చేయడం బాధిస్తోంది,” అంటూ స్పష్టం చేశారు.
2016లో జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకున్న ప్రీతి జింటాకు 2021లో జై, జియా అనే కవలలు జన్మించారు. సినిమాల పరంగా, సుదీర్ఘ విరామం తర్వాత ఆమె రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లాహోర్ 1947’ చిత్రంతో వెండితెరపైకి తిరిగి రానున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్, షబానా అజ్మీ, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రొడక్షన్ బాధ్యతలు అమీర్ ఖాన్ తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news