తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విజయవాడకు వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడానికి ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు. ఉదయం 9.15కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి, 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10.50 నుంచి 11.30 వరకు జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దేవినేని ఉమా, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారుని వివాహానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో టీడీపీలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతల మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతూనే ఉంది. రేవంత్ పార్టీ మారి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా, ఉమాతో ఆయన స్నేహబంధం దృఢంగానే ఉంది. ఇక ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో, ఈ వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే ఆసక్తికర దృశ్యం వెలువడే అవకాశముంది.