ప్ర‌ధాని రాక..ఇంత‌లో ఎంత మార్పు ? 

-

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాక నేప‌థ్యంలో భ‌ద్ర‌తావ‌ర్గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో కూడా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అణువ‌ణువూ శోధిస్తున్నాయి. తెలంగాణలో నేటి (శ‌నివారం) వేళ ఆయ‌న విచ్చేయ‌నున్న కార్య‌క్ర‌మానికి సంబంధించి షెడ్యూల్ ఖ‌రారు అయింది. భేగంపేట ఎయిర్ పోర్ట్ వ‌ద్ద ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌దులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆయ‌న్ను ఆహ్వానించ‌ను న్నారు. ఎప్ప‌టిలానే కేసీఆర్ అయితే ఎయిర్ పోర్ట్ కు వెళ్ల‌డం లేదు అని స్ప‌ష్టం అయిపోయింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల యాభై ఐదు నిమిషాల‌కు భేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నాక అక్క‌డి నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్ట‌ర్ ద్వారా 3 గంట‌ల ఇర‌వై నిమిషాల‌కు చేరుకుని, అటుపై నాలుగు గంట‌ల నుంచి తొమ్మిది గంట‌ల వ‌ర‌కూ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ ఉంటుంది.అటుపై నోవాటెల్ కు చేరుకుంటారు. ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల‌తో ఉన్నాయి. ఎన్నిక‌ల వ్యూహం, పార్టీ విస్త‌ర‌ణ అన్న‌వి ప్ర‌ధాన అంశాలుగా చేసుకుని జాతీయ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

ముఖ్యంగా ఏడాది చివర్లో గుజరాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో వాటిపై కూడా ఇదే స‌మావేశాల్లో వ్యూహ ర‌చ‌న  సాగ‌నుంది. అదేవిధంగా వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే మేఘాల‌య‌, నాగాలాండ్, త్రిపుర, క‌ర్ణాట‌క, ఛ‌త్తీస్ గ‌ఢ్ , మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా వ్యూహ ర‌చ‌న చేయ‌నున్నారు.

ఇక ఏపీలో జ‌రిగే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి కూడా ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. ఇక్క‌డ అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంత్యుత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. వీటికి అతిథిగా పాల్గొనేందుకు మోడీ వ‌స్తున్నారు. ఇక్క‌డే 30 అడుగుల మ‌న్యం వీరుడు అల్లూరి కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించి, వారికి నివాళుల‌ర్పించ‌నున్నారు. పార్టీల‌కు అతీతంగా అంతా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌న్న‌ది మోడీ పిలుపు. ఇప్ప‌టికే ఈ పిలుపులో భాగంగా ఆంధ్రావ‌ని లో ప్ర‌ధాన విప‌క్ష పార్టీలు అయిన టీడీపీ, జ‌న‌సేన‌కు ఆహ్వానాలు అందాయి. కాళ్ల మండలం, పెద‌అమిరంలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మాట్లాడ‌నున్నారు. ఆయ‌న ప్ర‌సంగం అనంత‌రం ఇక్క‌డి నేత‌లు ప్ర‌త్యేకించి భేటీ కానున్నారు అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇక్క‌డ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అణువ‌ణువూ త‌నిఖీ చేసి వెళ్లాయి. జిల్లా ఎస్పీ తో స‌మ‌న్వ‌యం చేసుకుని ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బీజేపీ  కార్య‌వ‌ర్గం నిరంత‌రం ప‌నిచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version