ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పారు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో ప్రసంగించలేకపోతున్నానని మైక్ తీసి పక్కన పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా ప్రధాని వ్యవహరించిన తీరుపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ పర్యటనలో శిరోహిలోని అబూ రోడ్డులో నిర్వహించిన ర్యాలీలో మోదీ ప్రసంగించాల్సి ఉంది. కానీ ఆయన అనుకున్న సమయానికి కంటే ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ‘నేను ఇక్కడకు రావడం ఆలస్యమైంది. ఇప్పుడు రాత్రి పదవుతోంది. నేను నిబంధనలు తప్పక పాటించాలని నా మనస్సాక్షి చెప్తోంది. ఇప్పుడు మీ చెంత మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానాల కోసం మళ్లీ ఇక్కడికి వస్తానని మాటిస్తున్నాను’ అని మోదీ వెల్లడించారు. మైక్‌ను పక్కనపెట్టి, ఈ మాట చెప్పారు. వెళ్లేముందు ‘భారత్ మాతాకీ జై’ అని నినదించారు. అలాగే వేదికపై మోకాళ్ల మీద వంగి సభికులకు నమస్కరించారు.