న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఘోర ఓటమి తర్వాత కూడా ఆ పార్టీ కోమాలో నుంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీ బీజేపీ ఎంపీల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన దురదృష్టకమన్నారు. రాజకీయ శూన్యతను అబద్ధాలతో భర్తీ చేయలేరని, ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.
దేశంలో ఎక్కడా వ్యాక్సిన్‌ల కొరత లేదని, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే దేశంలో ప్రతికూల వాతావరణం సృష్టిస్తున్నదని ఆరోపించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పటికీ 20శాతం ఫ్రంట్‌లైన్ వారియర్స్ వ్యాక్సిన్ వేసుకోకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
అధికారంలోకి రావడానికి తమకు అర్హత ఉన్నదని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ పార్టీ పతనం గురించి ఇంకా పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ఏవైనా ఆ పార్టీకి పరాజయం తప్పడం లేదు. ఆ విషయం గుర్తించడం లేదు. పైగా తమ గురించి కాకుండా బీజేపీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నది అని కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఎద్దేవా చేశారు.
ఈ నెల 24, 25వ తేదీలలో దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ జరగనున్నది. ఆయా రోజుల్లో రేషన్ షాపులను బీజేపీ నాయకులు సందర్శించాలి. కొవిడ్ పోరాటంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అని బీజేపీ నాయకులను ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేశారు.