అలా జరిగితేనే బీజేపీకి ఛాన్స్!

-

తెలంగాణలో 2019 ఎన్నికల ముందు వరకు బీజేపీ (BJP)కి పెద్ద సీన్ లేదు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 119 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. అలాగే దాదాపు 100కు పైనే స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కొన్ని స్థానాల్లో అయితే నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేదు. ఇలా దారుణమైన పరిస్తితుల్లో ఉన్న బీజేపీకి 2019 పార్లమెంట్ ఎన్నికలు కలిసొచ్చాయి.

మోదీ వేవ్‌లో బీజేపీ తరుపున నలుగురు ఎంపీలు గెలిచారు. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా ఉంటుంది. ఇతర పార్టీ నేతలనీ చేర్చుకుంటూ, బలోపేతం అవుతూ వస్తుంది. అలాగే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని ఓడించింది. అటు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించినంత పనిచేసింది. ఇప్పుడు ఈటల రాజేందర్‌ని పార్టీలో చేర్చుకుని, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెడతామని అంటుంది.

అలాగే అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ చెబుతోంది. అటు ప్రజలకు మరింతగా దగ్గరయ్యేందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. కానీ బీజేపీ బలోపేతం అవ్వడం అంత సులువా? అంటే కాస్త కష్టమనే చెప్పొచ్చు.

ఇప్పటివరకు బీజేపీకి వచ్చిన విజయాలు నాయకత్వం మీద ఆధారపడి వచ్చినవి. ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో పెద్దగా బలం లేదు. గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ లేదు. అలా అని నగరాల్లో కూడా బీజేపీకి పట్టు లేదు. హైదరాబాద్‌లో సత్తా చాటిన బీజేపీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్రెస్ లేదు. అలాగే ఉమ్మడి నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి జిల్లాల్లో ఆ పార్టీకి బలం పెద్దగా లేదు. కాబట్టి బీజేపీ వచ్చే ఎన్నికల్లోపు అన్నిచోట్ల బలోపేతం అయితేనే టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వగలదు. అప్పుడే గెలిచి అధికారంలోకి రాగలదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version