ప్రధాని నరేంద్ర మోడీ నేడు విశాఖలో పర్యటిస్తున్న సందర్భంగా రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కాషాయ పార్టీ నేతలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విభజన హామీలో లేదని, దానిని ప్రైవేటు పరం చేయబోమని పీఎం మోడీతో చెప్పించాలని ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు.
చంద్రబాబు ప్రధాని మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని షర్మిల వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని విమర్శించారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారని, 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారని.. ఆ మాటలు కోటలు దాటాయి తప్పా చేతలకు దిక్కులేదని షర్మిల ఘాటు విమర్శలు చేశారు.