సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. గత 24 ఏళ్లలో గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం సోనియా గాంధీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖర్గే.. సోనియాకు రాజీవ్ గాంధీ చిత్రాన్ని బహూకరించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా వైదొలగడం పట్ల ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. తల్లిని ఉద్దేశిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా. ప్రపంచం ఏమనుకున్నా, ఏం ఆలోచించినా సరే.. నాకు తెలుసు ఇదంతా నువ్వు కేవలం ప్రేమ కోసమే చేశావని’’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖర్గే బహుకరించిన చిత్రాన్ని చూపిస్తున్న సోనియా ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.