తెలంగాణ ఎన్నికల్లో నిన్నటి వరకు ఓ లెక్క.. నేటి నుంచి ఓ లెక్క అన్నట్టుగా ఉంది. ఇక్కడ త్వరలోనే పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో సాధారణ ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న పట్టు తిరుగులేకపోయినా ఉద్యోగ వర్గాల్లో మాత్రం ప్రభుత్వంపై చాపకింద నీరులా వ్యతిరేకత ఉంది. అదే సమయంలో విద్యార్థుల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం పట్ల గత ఎన్నికల తర్వాత పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉంటుంది ? అన్నదానిపైనే ఈ వర్గాల్లో కేసీఆర్‌కు పట్టు ఉందా లేదా ? అన్నదానిపై క్లారిటీ వస్తుంది.
ఇక త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం రంగంలో ఉండనున్నారు. కోదండరాం ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టే. ఆయనకు కాంగ్రెస్‌తో పాటు మిగిలిన రాజకీయ పక్షాల నుంచి కూడా మద్దతు ఉంటుందని తెలుస్తోంది. కోదండరాం లాంటి నేత మండలిలో ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ఇరుకున పెడతారని అందరూ భావిస్తున్నారు.
ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతగా ఆయనకు విద్యా, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో మంచి పేరుంది. ఇక ఖమ్మం లాంటి సెటిలర్ ఓటింగ్ ఉన్న చోట్ల అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరాంకే ప్లస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఇటు విద్యార్థి సంఘాలు సహకరిస్తే ఖచ్చితంగా కోదంరాం గెలుపు సులువు అవుతుంది. ఇక ఈ పరిస్తితుల నేపథ్యంలో కోదండారంపై టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ పెట్టి ఓడిపోవడం కంటే.. పోటీ చేయకపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తోందట.
మరోవైపు కోదండ రాంకు చెందిన తెలంగాణ జనసమితి ఇప్పటికే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలకు లేఖలు రాసింది. ఏదేమైనా కోదండ రాం రంగంలో ఉండడంతో ఈ ఎన్నిక తెలంగాణలోనే మంచి రసవత్తర ఎన్నికగా మారిపోయిందనడంలో సందేహం లేదు.
-Vuyyuru Subhash