గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కూడా ఎక్కడికక్కడ తమ గోడు వినిపించేందుకు, అధికారులను, ఇతర ప్రభుత్వ వర్గాలను నేతలతో పాటే నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారు. అయినా సరే ! కార్యక్రమాన్ని ఆపేందుకు వీల్లేదని రానున్న ఎనిమిది నెలల కాలంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఇచ్చేందుకు, పథకాలకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం అందుకున్న వారిని ఎమ్మెల్యేలు నేరుగా కలుసుకుని, ఎందుకు సంబంధిత పథకాలు అందించామో, ఏ ఉద్దేశంతో వీటిని బడుగులకు, పేద, మధ్య తరగతి వర్గాలకు చేరవేశామో వివరించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశిస్తున్నారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా వెళ్లని వారిని, ప్రజలతో మమేకం కాని వారిని బ్లాక్ లిస్టులో ఉంచనున్నారు. ఆ విధంగా మొదటి విడత గడపగడపకూ కార్యక్రమానికి ఒక్కసారి కూడా హాజరుకాకుండా ఇంటికే పరిమితం అయిన ఏడుగురు ఎమ్మెల్యేలను జగన్ బ్లాక్ లిస్టులో ఉంచారు. వచ్చే ఎన్నికల్లో వారికి పార్టీ టికెట్ కూడా రాదు అని తేలిపోయింది.
ఇక ఎమ్మెల్యేలలో కొందరికి చేదు అనుభవాలు ఉన్నాకూడా వాటిని కూడా దాటుకుని వెళ్తున్నారు. కోన రఘుపతి (డిప్యూటీ స్పీకర్ ) కు చాలా చోట్ల అవమానాలే ఎదురయ్యాయి. కొందరు మహిళలు పన్నుల విధింపుపై ఆయన్ను నిలదీశారు. ఓ మహిళ అయితే మీకు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్నామని ఆయన ఎదురుగా అన్నంత పనీ చేసింది. అయినా సరే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గంలో సంబంబంధిత ప్రొగ్రాంను అయితే ఆపలేదు. ప్రజలపై ఆయన విసిగి పోలేదు.
వీలున్నంత వరకూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి వస్తున్నారు. వితంతు పింఛను తనకు అందడం లేదని పేర్కొంటూ రఘుపతిని శివలీల అనే మహిళ నిలదీసింది. ఆమె విషయమై అధికారులతో మాట్లాడారు. ఇదే సందర్భంలో తమకు కారు లేదని రవాణా శాఖ నుంచి తన కొడుకు సర్టిఫికెట్ తెచ్చినా కూడా పింఛను పునరుద్ధరించలేదని చెబుతూ, డిప్యూటీ స్పీకర్ ఎదుటే చెంపలేసుకుంది.
ఈ హఠాత్ పరిణామంతో డిప్యూటీ స్పీకర్ కు ఒక్క క్షణం నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని అధికారులతో మాట్లాడారు. ఇలాంటి పరిణామాలు ఉన్నా కూడా కార్యక్రమాన్ని ఆపకూడదు అని, ప్రజా సమస్యలు స్పష్టంగా తెలుసుకుని, వీలున్నంత మేరకు పరిష్కారం దిశగా అధికారులకు మార్గ నిర్దేశం చేసే రావాలని సీఎం జగన్ అంటున్నారు. అదేవిధంగా అవంతి లాంటి ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోవడాన్ని కూడా సీఎం తప్పుపట్టారు.
ఏదేమయినప్పటికీ మలి విడతలో ఎమ్మెల్యేలు మరింత బాగా జనంలోకి చొచ్చుకుని పోవాలని సీఎం అంటున్నారు. పని చేయని ఎమ్మెల్యేలను తప్పించడం ఖాయం అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అలానే ఇప్పుడున్న ఎమ్మెల్యేల పని తీరును ఆరు నెలల పాటు మానిటరింగ్ చేశాకే, తప్పిస్తానని కూడా చెప్పారు. అంటే రానున్న కాలంలో అవరోధాలు ఉన్నా, అవమానాలు ఉన్నా, ప్రజా క్షేత్రంలో తిరుగుబాటు ఉన్నా గడపగడపకూ అనే కార్యక్రమం మాత్రం ఆగే వీల్లేదని నిర్థారణ అవుతోంది.