భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ..మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నవంబరు 29న పీఎస్ఎల్వీ-సీ 43 ద్వారా హైసిస్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందుకుగాను 28 గంటల కౌంట్‌డౌన్ బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైంది. గురువారం ఉదయం 9.59గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు ఇస్రో చైర్మన్ కే. శివన్ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ద్వారా మన దేశానికి చెందిన హెచ్‌వైఎస్ఐఎస్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30కిపైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. వీటిలో చిన్న, నానో ఉపగ్రహాలసంఖ్యే అధికం. హెచ్‌వైఎస్ఐఎస్ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో 630 కిలోమీటర్ల దూరంలో భూమిపై రంగురంగుల చిత్రాలను చూసే అవకాశముంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాల అంచనా నీరు, మట్టి ఇతర భౌగోళిక పరిసరాలకు సంబంధించి సేవలను అందిస్తుందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.