విజయనగరం గజపతుల ఖ్యాతి.. వారసత్వ పోరుతో రచ్చకెక్కుతోంది. సంచయిత, ఊర్మిళల రాకతో.. వ్యవహారం ఏపీలో పెద్దచర్చకే దారితీసింది. బాబాయ్, అమ్మాయిల కౌంటర్లతో వివాదం ముదురుతోంది. ఎవరికి వారు ఆధిపత్యం కోసం వేస్తున్న ఎత్తులు దుమారం రేపుతున్నాయి. మన్సాస్ ట్రస్ట్, సింహాచలం, తూర్పుగోదావరి జిల్లాలోని 9 ఆలయాలకు ఛైర్ పర్సన్ గా సంచయితను ప్రభుత్వం నియమించడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు అశోక్ గజపతిరాజు. ఇంతకీ రాజవంశంలో వారసత్వ పోరు వివాదాలకు కారణమేంటి…
పూసపాటి రాజవంశంలో బాబాయ్-అమ్మాయ్ మధ్య వారసత్వ పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది ఆలయాలకి ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజుని తప్పించి ..సంచైతా గజపతిరాజుకు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించడంపై మరోసారి వివాదం చెలరేగుతోంది. అనువంశక వారసత్వ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదంటూ మండిపడ్డారు అశోక్ గజపతిరాజు. సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు.
సంచైతా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పూసపాటి వంశంలో వారసత్వ పోరు రోజుకో వివాదంతో రోడ్డుకేక్కుతోంది. ఇప్పటికే మూడు లాంతర్లు కూల్చి వేత , ఎమ్మార్ జూనియర్ కాలేజి మూసివేత , డిగ్రీ కళాశాలను ఎయిడెడ్ హోదాను సరెండర్ చేయడం వంటి వివాదాలు కోనసాగుతున్నాయి. తాజాగా దేవదాయ శాఖ తీసుకొచ్చిన కొత్త జీవో బాబాయ్ అమ్మాయ్ మధ్య మరింత అగ్గి రాజేసింది . తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కి ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజుని తప్పించి ..సంచైతా గజపతిరాజుకు బాధ్యతలు అప్పగించడంపై మరోసారి వివాదం మొదలైంది.
సంచైతా సైతం సోషల్ మీడియా వేదికగా అశోక్ గజపతి రాజు పై ఫైర్ అవుతూ వస్తున్నారు . ఆయన మన్సాస్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో రాజకీయ అస్థిత్వం కోల్పోకూడదనే ….ఇప్పుడు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 13కోట్ల విలువైన భూములను కోర్టులో లాయర్ ని నియమించకుండా ఎక్స్ పార్టీ డిక్రి ద్వారా అన్యాక్రాంతం కావడానికి కారణమయ్యారని ఆరోపించారు. తక్కువ దరకే వేల ఎకరాల ట్రస్ట్ భూములను తన అనుయాయులకు లీజుకిచ్చారంటూ మండిపడ్డారు సంచైతా.
ఘనమైన చరిత్ర ఉన్న గజపతిరాజుల కోటలో అసలు కలకలం ఎందుకు మొదలైంది అంటే… పీవీజీ రాజు బతికున్నంత వరకు అంటే 1994 వరకు మన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఆయనే వ్యవహరించారు. తర్వాత ఆయన పెద్దకొడుకు ఆనందగజపతిరాజు చైర్మన్ అయ్యారు. ఆయన మరణం తర్వాత కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు ట్రస్టు చైర్మన్ అయ్యారు. ఈ ఇరువురు అన్నదమ్ముల మధ్య ఆదినుంచి రాజకీయ విభేదాలు ఉండేవి. ఇదిలా ఉండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అశోక గజపతిరాజును మన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అంతేకాకుండా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను ట్రస్టు చైర్‌పర్సన్‌గా, సింహాచలం ఆలయం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమించడంతో వివాదం రాజుకుంది.
అయితే ఊహించని విధంగా సంచయిత చెల్లెలు ఊర్మిళ తెరపైకి రావడంతో విజయనగరంలో కాకపుట్టింది. ఉమతో విడాకుల తర్వాత ఆనందగజపతిరాజు సుధను వివాహం చేసుకున్నారు. ఆమెకు కల్గిన సంతానమే ఊర్మిళ. విశాఖ ఓగ్రిడ్జ్ కళాశాలలో ఇంటర్ చదివిన ఊర్మిళ అమెరికాలో బ్యాచ్‌లర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేశారు. మొదటి నుంచి అక్కాచెల్లెళ్లు సంచయిత, ఊర్మిళ మధ్య సత్సంబంధాలు ఏమాత్రం లేవు. తాను కూడా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ఊర్మిళ ప్రకటించడంతో రాజవంశం పోరు రసవత్తరంగా మారింది. అక్కాచెల్లెళ్ల మధ్య పోరుకు తోడు, సంచైత, అశోక్ గజపతిరాజు మధ్య ముదిరిన వివాదం ఏ మలుపు తిరుగుతుందో, ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.