అసలు ఈటెల నిజమైన ఉద్యమకారుడేనా..? ఇదీ ప్రశ్న.. వెసిందెవరూ అంటే..? హరీష్ రావు, కేటీఆర్, బాల్కా సుమన్ లు కాదు. ఆయన మరెవరో కాదు.. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా, పదవులను తృణ ప్రాయంగా వదిలేసి, కేసీఆర్ అడుగు జాడల్లో నడిచి తెలంగాణ కోసం తల నరుక్కుంటానన్న ది గ్రేట్ లీడర్ దానం నాగేందర్..
దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. ఉద్యమం గురించి మాట్లాడుతున్న నిఖార్సయిన, నిజమైన, నిజాయితీగల నాయకుడు మరి. అవును తెలంగాణ వచ్చిన తరువాత పుట్టిన వారు దానం వ్యాఖ్యలు చూస్తే నిజమేననుకుంటారేమో. విడ్డూరం కాకపోతే మరేంటి.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రోజుల్లో ఓ ఫోటో మీడియాలో సంచలనమైంది.. లాఠీ పట్టుకొ ఓ నేత విద్యార్థులపైకి దాడికి వెళ్తున్న ఫోటో అది. అందులో లాఠీ పట్టుకున్న నేత ఎవరో ఆంధ్ర నాయకుడు కాదండోయ్.. అదే ఇప్పుడు ఉద్యమం గురించి మాట్లాడుతున్న వీర తెలంగాణ వాది నాగేందర్.. నాగేందర్ దాడిలో దెబ్బలు తిన్న వారు సమైక్యవాదులు కాదండీ.. తెలంగాణ కావాలంటూ పోరాటం చేస్తున్న విద్యార్థులు. ఈ ఒక్క ఫోటో చాలు దానం నాగేందర్ ఉద్యమానికి ఎంతగా సహకరించారో..
మరి అలాంటి నాయకుడు తెలంగాణ ఇంటి పార్టీలోకి రావడం జీర్ణించుకోలేకపోయారు చాలా మంది. అంతసక్కని నాయకుడు నేడు ఉద్యమం గురించి, అందునా ఈటల గురించి మాట్లాడటాన్ని ఏమనోలో కూడా తెలియని పరిస్థితి. అసలు నిజాలు మాట్లాడితే ఇంటి పార్టీలో ఉన్నవారెవరు?? ఇంటి వారేనా లేక కిరాయిదారులా?? లేక దోపిడీ దారులా అనేది తెలంగాణ సమాజం ప్రశ్న.?? తెలంగాణ కోసం మిలియన్ మార్చ్, రాస్తా రోకోలు, ధర్నాలు చేసి, జైలుకెళ్లిన సామాన్య కార్యకర్తల ప్రశ్న…?? మరి ఇప్పటి వరకు గుర్తుకు రాలేదా ఇవన్నీ ఇప్పుడే ఎందుకు అని ప్రశ్నించే వారికి సమాధానం కూడా ఈజీగానే దొరికేస్తుంది. కడుపు మండి.. సమైక్యవాదుల తొత్తుగా, తెలంగాణ నాయకత్వాన్ని అవమానించిన వారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని అవమానకరంగా మాట్లాడటం.
ఉద్యమ పార్టీ కాస్తా ఫక్తు రాజకీయ పార్టీగా మారింది కాబట్టి అన్నీ మూసుకొని ఉండాలా..? ఇది ఎలా ఉందంటే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎంట్రీ టీఆర్ఎస్ కు ఎలా కలిసివచ్చిందో అలాగే దానం ఎంట్రీ, విమర్శలు, సమైక్యవాద తొత్తుల మాటలు ఈటల రాజేందర్ కు కలిసి వచ్చేలా ఉన్నాయి. ఆత్మగౌరవం అనే పాయింట్ గట్టిపడే అవకాశం వస్తుంది. విమర్శించాలి కాబట్టి విమర్శించడం తప్పితే దానం వ్యాఖ్యలపై సొంత పార్టీ (తెలంగాణ ఉద్యమకారులు) నాయకులే ఆమోదించలేకపోతున్నారు.
హైదరాబాద్ నీ అయ్య సొత్తా? హైదరాబాద్‌లో తిరగనియ్యం అన్న ఓ నాయకుడు నీ బాంచన్ అనే దాకా తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిది, తెలంగాణ ఉద్యమకారులది. సరే వచ్చి ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అక్కడ వరకు బానే ఉంది.. విమర్శిస్తే ఈటల కబ్జాల గురించి ప్రశ్నిస్తే బాగుండేది.. కానీ నిజమైన ఉద్యమం అంటూ నోటికొచ్చింది మాట్లాడితే ఎలా.? మాట్లాడే ముందు ప్రిపేర్ కావాలి కదా..? ఉద్యమం, నిఖార్సయిన ఉద్యమకారుల గురించి మాట్లాడటం బాగోలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. తగ్గేదేలే అంటూ ఉరికి ఉరికి విమర్శలు చేయడం ఉరికించి కొట్టినంత వీజీగా ఉండదు.. ఫలితం నెగెటివ్‌గా వస్తుందేమో దానం… ఉద్యమంలో లేకపోయినా అంటూ నిజమైన ఉద్యమం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.
ఇదే ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది.. తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర.. దేశం మొత్తం గౌరవించిన ఉద్యమం, పోరాడితే ఇలా పోరాడాలంటూ స్పూర్తి పొందే ఓ యాగం. ఆంధ్ర తెలంగాణ అని తేడా లేకుండా అందరూ గొప్పగా చెప్పుకొనే ఓ చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ రాష్ట్ర సాధన.