అధికార పార్టీ శాసనసభ్యులకు, గృహ సారధులకు, వాలంటీర్లకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ, స్వచ్ఛందంగా తమ ఇంటికి నువ్వే మా నమ్మకం జగన్ అనే స్టిక్కర్లను అతికించుకుంటున్నారని సాక్షి దినపత్రికలో రాయడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తమ పార్టీలో ఇంత మంది సిగ్గులేని నాయకులు ఉన్నారని, ఈ కార్యక్రమం ద్వారా తెలిసిందని, తనని లుచ్చా అన్న ఓ లుచ్చా మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో గుమిలి తీసే వాడి మాదిరి మెడకు సంచి తగిలించుకొని తిరుగుతుంటే, ఆయన సామాజిక వర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇంటింటికి స్టిక్కర్ అంటిస్తూ ఫోటోలను దిగి వాటిని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పంపితే ఆయన సాక్షి దినపత్రికలో వేయిస్తారట అని అన్నారు. వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బానిస విధానం, గతంలో ఈజిప్షన్ రాచరికంలో కొనసాగేదని, నల్ల జాతీయులను మెట్లపై పడుకోబెట్టి వారి పైనుంచి ఫెరోలు నడుచుకుంటూ వెళ్లిన దాని కంటే, తమ పార్టీలో దారుణమైన బానిసత్వం కొనసాగుతోందని తెలిపారు. మంత్రులు, శాసనసభ్యుల పరిస్థితి వాలంటీర్ల కంటే దారుణంగా ఉందని, ఇంటింటికి స్టిక్కర్ అతికించే కార్యక్రమములో పాల్గొనే విషయంలో రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని, రాయలసీమ ప్రాంతానికి చెందిన పెద్ద రెడ్లైనా తమ పార్టీ శాసనసభ్యులు మెడకు సంచి తగిలించుకొని నువ్వే మా నమ్మకం జగన్ అని ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికిస్తారని తాను భావించడం లేదని అన్నారు.