సలహాలు ఇవ్వడానికే వంద మంది సలహాదారులను నియమించుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారికి ఏమి సలహా ఇవ్వగలరని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. ఐఏఎస్ పాసైన విద్యాధికుడైన జవహర్ రెడ్డి గారు తనకు జగన్ మోహన్ రెడ్డి గారు సలహాలు ఇస్తారని భావించడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. తన తమ్ముడి కోసం, బాబాయి కోసం జగన్ మోహన్ రెడ్డి గారు తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నారని ప్రజలంతా భావిస్తున్న తరుణంలో, ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉండడంతో, దానికి ముఖ్యమంత్రి గారిని అందుబాటులో ఉండాలని జవహర్ రెడ్డి కోరడం వల్లే, తన కూతుళ్లను లండన్ వెళ్లి చూడాలనుకున్న కార్యక్రమాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నారట అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం కోసం ముఖ్యమంత్రి గారు మరోసారి ఢిల్లీ పెద్దలను కలవనున్నట్లు తెలిసిందని అన్నారు.
తాను గత రెండు, మూడు రోజుల క్రితమే ప్రత్యేక హోదా, పోలవరం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలను కలుస్తారని చెప్పానని అన్నారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని తేలికగా తీసిపారేసిన సాక్షి దినపత్రిక, సాక్షి ఎం.డి బంధువులను మాత్రం మహానేత అన్నట్లుగా కీర్తించడం, తమ పార్టీ నాయకులంతా వారికి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని, పార్టీ నిర్ణయం ప్రకారం క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా తాను కూడా వై.యస్. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గార్లకు మద్దతు తెలియజేశానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
ప్రత్యేక హోదా, పోలవరం కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు తమ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ను టెక్నికల్ కమిటీ క్లియర్ చేసిందని , కేబినెట్ క్లియర్ చేయవలసి ఉందని, అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రావలసిన అవసరం ఉంటుందని జవహర్ రెడ్డి గారు చెప్పారట అని అన్నారు. మరి ముఖ్యమంత్రి గారిని, జవహర్ రెడ్డి గారు ఢిల్లీకి రమ్మంటారో, లేదో తెలియాల్సి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి గారు తన సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి ప్రత్యేక హోదా, పోలవరంను సాకుగా చూపెడుతున్నారన్నారు. ప్రతిసారి ప్రత్యేక హోదా, పోలవరం పనుల కోసమే ఢిల్లీ పెద్దలను కలిశానని చెబితే ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.