కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ మెంబర్ డా.కె.లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచిందని, ఎన్నికలకు ముందు రైతుభరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని, ఇప్పుడు రూ.12 వేలు అంటున్నారని విమర్శించారు. వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హామీ ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ముక్కు నేలకు రాయాలన్నారు. ఇదిలాఉండగా, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకూ రైతు భరోసా కింద ఏటా రూ.12 వేల పెట్టుబడి సాయం ఇస్తామని సీఎం రేవంత్ నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం చూస్తున్నది.