ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జనగర్జన సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడ్నించి హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చారు. హెలిప్యాడ్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ దేశాన్ని కలపడం, ఇతరుల ఐడియాలజీ దేశాన్ని విభజించడమని ఆయన వ్యాఖ్యానించారు. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించిందని, జోడో యాత్రతో విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామన్నారు రాహుల్.
ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ ఉందని, అందుకే మీరు కాంగ్రెస్ ఆలోచనలు సమర్థించారన్నారు. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి స్వాగతిస్తున్నామని, భట్టి తెలంగాణలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బలహీనులకు అండగా నిలిచారని, పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను నేను అభినందిస్తున్నానని రాహుల్ అన్నారు. తెలంగాణకు వచ్చినప్పుడు నా యాత్రకు మీరందరు శక్తినిచ్చారని, తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేదని, తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.