ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మంలో ముగిసింది. 13 కి.మీ దూరంలో నిన్న బస చేసిన బట్టి.. ఇవాళ జనగర్జన సభకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ముగించారు. 109 రోజులు.. 1360 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేపట్టారు. మరోవైపు జనగర్జన సభ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. సుదీర్ఘ యాత్ర చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సభలో సన్మానించారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనగర్జన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారత్ జోడోయాత్రకు కొనాసాగింపే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెట్టానని, పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకున్నాని ఆయన వెల్లడించారు.
పీపుల్స్ మార్చ్ నా పాదయాత్ర కాదు.. అధికార మదంతో విర్రవీగుతున్నవారికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన యాత్ర ఇది అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దేశమంతా ఒకటిగా ఉండాలని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ నడిచారని భట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని, మన రాష్ట్రం వస్తే భూములు వస్తాయని అనుకున్నారని కానీ దాని విరుద్ధంగా జరిగిందన్నారు భట్టి. పోడు రైతులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారని, ధరణికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు నాతో చెప్పారని భట్టి ప్రసంగించారు.