భారత్ జోడో యాత్ర పేరిట ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఈ జోడో యాత్రలో రోజుకు 7,8 గంటలు నడుస్తున్నానని, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు. అన్ని వర్గాల వారిని కలిశాను..ఎవరు ఆనందంగా లేరని, కాంగ్రెస్ నాయకులంతా ఈ యాత్రలో నడుస్తున్నారన్నారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టిన ఈ యాత్ర ఆగదని, ఏ యువకున్ని కదిలించినా తాను నిరుద్యోగి అని చెబుతున్నాడన్నారు. 2014 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య, దరిద్రం పెరిగిపోయిందని, చిన్న, సన్న కారు వ్యవస్థలే చాలా మందికి ఉపాధిని కల్పిస్తాయని, 2014 తర్వాత మోడీ, సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చే రంగాలపై దాడి చేశారన్నారు. మోడీ నోట్ల రద్దు చేసి అందరి వెన్ను విరిచారని ఆయన ఆరోపించారు.
2014 తరువాత మోడీ, కేసీఆర్ రైతులపై దాడి చేశారని, జోడో యాత్రలో రైతులతో మాట్లాడానన్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితిని నాగిరెడ్డి అనే రైతు రాహుల్ గాంధీకి వివరిస్తూ.. కేసీఆర్.. వ్యవసాయ శాఖ మంత్రి రైతుల మాటలు వింటే బాగు పడతారన్నారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ లో ఎవరు సంతోషం గా లేరని, యువత..పేదలు..చిరు వ్యాపారులు అందోళనలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి నడుస్తున్నారని, పెద్ద వ్యాపారులు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, చిరువ్యాపారులు ఉద్యోగాలు ఇవ్వలేరని ఆయన అన్నారు. ప్రభుత్వ సెక్టార్ ని అమ్మేస్తున్నారన్నారు.