న్యూఢిల్లీః రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారా? రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠంపై కూర్చోబోనని తెగెసి చెప్పారా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలు అలాంటివి మరి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సంగతి తెసిందే. అప్పటి నుంచి సోనియా గాంధే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
అయితే, కాంగ్రెస్ చీఫ్గా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయన పిలుపు వచ్చినట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఆయనను ఢిల్లీకి అకస్మాత్తుగా పిలిపించడంతో ప్రధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు రాహుల్ గాంధీ సైతం మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడంతోనే.. దీనిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.
ఇక రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకపోతే.. అశోక్ గెహ్లట్కు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం. దీనికి తోడు అశోక్ గెహ్లట్.. గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో పాటు నమ్మిన వ్యక్తిగా అయనకు గుర్తింపు ఉంది. అలాగే, పాత తరం, కొత్త తరం నేతలను కలపడంలోనూ ఆయన దిట్ట. మరీ ముఖ్యంగా రాష్ట్ర క్యాబినేట్ విస్తరణలో తలమునకలై ఉన్న వేళ గెహ్లట్ను ఢిల్లీకి పిలిపించడం ఈ తాజాగా చోటుచేసుకున్న అంచనాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.