మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంది : సీఎం కేసీఆర్‌

-

సనాతన ధర్మంలో రక్షా బంధన్ పండుగ పవిత్ర సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. రాఖీ పండుగ కోసం అక్కాచెల్లెళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ రోజున, ఆమె తన సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టి, అతని భద్రత , దీర్ఘాయువును కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరిని కాపాడతానని హామీ ఇస్తాడు. ర‌క్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంద‌న్నారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని సీఎం పేర్కొన్నారు.

మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసాను అందిస్తున్నాయన్నారు. సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదర భావాన్ని పెంచుతున్నదని సీఎం అన్నారు .

అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version