రూట్ మార్చిన రకుల్.. అలాంటి కథలతో బాలీవుడ్ లో దూసుకెళ్తోంది

-

‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కు ఆ సినిమా అంతగా పేరు తీసుకురాలేదు. కానీ తర్వాత వచ్చిన  ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో రకుల్ తన పరుగు ఆపలేదు. ఎక్స్ ప్రెస్ వేగంతో టాలీవుడ్ లో దూసుకెళ్తూ ఇటు యంగ్ హీరోలతో పాటు అటు నాగార్జున వంటి సీనియర్ హీరోలతో కూడా నటిస్తూ స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకుంది. అయితే కొంత కాలంగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు రకుల్.

గత కొద్ది కాలంగా రకుల్ తన మకాం ముంబయికి మార్చింది. హిందీ సినిమాలతో బిజీగా బిజీగా ఉంది. కథల ఎంపికలోనూ రకుల్ తన పంథాను మార్చేసింది. కేవలం తన పాత్ర ఓ పాటకు మాత్రమే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటోంది. ముఖ్యంగా సామాజిక సమస్యలపై చర్చను లేవనెత్తే అంశాలకు సంబంధించిన కథలను ఎంపిక చేసుకుంటోంది. ‘డాక్టర్‌ జి’, ‘ఛత్రివాలి’ సినిమాలు ఈ కోవకు చెందినవే.

గైనకాలజిస్ట్‌గా ఓ పురుష వైద్యుడు చేసే పోరాట కథతో రూపొందిన సినిమా ‘డాక్టర్‌ జి’. ఇక ‘ఛత్రివాలి’.. కండోమ్‌ టెస్టర్‌ పని చేసే ఓ యువతి కథతో రూపొందుతున్న చిత్రం. ఇందులో ఆ టెస్టర్‌ పాత్రను రకుల్‌ పోషించింది. ‘ఈ తరహా కథాంశాల్లో నటిస్తున్నానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారా?’ అని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో ఇలా బదులిచ్చింది రకుల్‌.

‘‘సామాజిక సమస్యలపై చర్చను లేవనెత్తే చిత్రాలివి. అందుకే వీటిని నా తల్లిదండ్రులు గొప్ప ఆలోచనలుగా భావించారు. నన్నెంతో ప్రోత్సహించారు. ‘డాక్టర్‌ జి’లో గైనకాలజిస్ట్‌ అయిన ఓ పురుష వైద్యుడి గురించి చర్చించాం. మన వద్ద ఇలాంటి వాటిపై నిషేధం ఉండటం దురదృష్టకరం. గుండె, మెదడు.. ఇలా శరీరంలోని ఇతర వ్యవస్థల కంటే పునరుత్పత్తి అవయవాన్నే ఎందుకు భిన్నంగా చూడాలి. చికిత్స చేయడం వైద్యుడు పని అని అందరికీ తెలుసు. ఆ వైద్యుడు మగవాడైతే ఏంటి? ఆడవారైతే ఏంటి? దానిపై మేము ‘డాక్టర్‌ జి’ ద్వారా చర్చిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

ఇక ‘డాక్టర్ జి’ సినిమా అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇలాగే తన కథల ఎంపికను కొనసాగిస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఇక బాలీవుడ్ లోనూ ఎక్స్ ప్రెస్ వేగంతోనూ దూసుకెళ్లడం ఖాయమంటున్నాయి బీ టౌన్ వర్గాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version