అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్లో రెండు రోజుల పర్యటనకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఈ నెల 24న వస్తున్నారు. 24, 25వ తేదీల్లో.. మొత్తం మూడు దశల్లో అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీని ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ట్రంప్ పర్యటనకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక భారత పర్యటన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొలరాడో సభలో ట్రంప్ మాట్లాడుతూ.. మొతేరా స్టేడియానికి వెళ్లే 22 కిలోమీటర్ల దారి పొడవునా కోటిమంది తనకు స్వాగతం పలకబోతున్నారని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైరిక్ గా ట్వీట్ చేశారు. ‘ఇండియాలో ట్రంప్ ను 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారి ఉంది. ట్రంప్ పక్కన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమే’ అంటూ వర్మ చమత్కరించారు. వర్మ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేఏ పాల్, మెగాస్టార్, పవన్ కల్యాణ్ లను మర్చిపోయారంటూ కొందరు రీట్వీట్ చేశారు.