రమణదీక్షితులు చుట్టు తిరుపతి ఉప‌ఎన్నిక రాజకీయం

-

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు చేసిన కామెంట్స్‌ విపక్షాలకు ఆయుధంగా మారాయి. విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ రావడంతో రమణ దీక్షితులు తిరిగి తిరుమల ప్రధాన అర్చకులు అవుతారని అంతా భావించారు. న్యాయపరమైన చిక్కులు కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. కొన్ని రోజుల క్రితం అర్చకులకు వయో పరిమితి నిబంధన తొలగించి అప్పట్లో పదవీ విరమణ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా రమణ దీక్షితులు ఇటీవల చేసిన కామెంట్స్‌ మాత్రం దుమారం రేపుతున్నాయి.

శ్రీవారి ప్రధాన అర్చకుడిగా మళ్లీ నియమించినందుకు జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తిగా ప్రశంసించారు రమణదీక్షితులు. శ్రీవారిని తప్ప దైవంగా మానవమాత్రుడ్ని కీర్తించకూడదన్న రీతిని పక్కనబెట్టి మరీ‌ సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. వైసీపీతో సన్నిహితంగా ఉండే హిందూత్వ సంఘాలు మఠాలు తప్ప.. మిగతా అందరూ రమణదీక్షితుల మాటల్నితప్పు పట్టారు. ఏపీలో తిరుపతి ఉపఎన్నిక వ్యవహారం కాక రేపుతున్న వేళ‌ రమణ దీక్షితులు మాటలు విపక్షాలకు అస్త్రంగా మారాయి. తిరుమల‌ భక్తుల‌ మనోభావాలు దెబ్బతీస్తున్నారని విపక్షాలు నానా యాగీ‌చేస్తున్నాయి.

2018లో శ్రీవారి ఆలయంలో పింక్ డైమండ్ పోయిందని.. వకుళామాత పోటులో నేలమాళిగలను తవ్వేసారని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన అర్చకుడు కావడంతో అప్పట్లో ఆయన మాటలను అంతా నమ్మారు. ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రమణదీక్షితులు చేసిన ఈ ఆరోపణలు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలకు ఆజ్యం పోశాయి. అప్పటి పాలకపక్షానికి కంట్లో నలుసులా తయారైన రమణదీక్షితులును సాగనంపడానికి వయోపరిమితి నిబంధనను తెరపైకి తీసుకువచ్చింది టీటీడీ. 65 ఏళ్లు పైబడిన అర్చకులకు పదవివిరమణ నిబంధనను అమలు చేస్తూ రమణ దీక్షితులుతో సహ మిగిలిన ముగ్గురు ప్రధానార్చకులను పదవి విరమణ చేయించారు.

బలవంతంగా పదవి విరమణ పొందిన రమణదీక్షితులు అప్పటి ప్రతిపక్షనేతని ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం జరిగిందని ఏకరవు పెట్టారు. దీనితో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామంటూ రమణ దీక్షితులకు హామీ ఇచ్చారు ఆనాడు జగన్.
వైసీపీ ప్రభుత్వం‌వచ్చాక 2019 నవంబర్‌లో శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా, డిసెంబర్‌లో గౌరవ ప్రధాన అర్చకులుగా ఆయన్ని టీటీడీ నియమించింది. అయినప్పటికీ అర్చకులకు వయోపరిమితి నిబంధనను తొలగించాలని.. తనతోపాటు పదవి విరమణ పొందిన అందరినీ తిరిగి తీసుకోవాలని రమణ దీక్షితులు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఇటీవల ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది.

పింక్‌ డైమాండ్‌, శ్రీవారి నగలపై రమణ దీక్షితులు గతంలో‌ చేసిన ఆరోపణలు సైతం బయటకు తీసిన టీడీపీ,బీజేపీ నేతలు ఉప‌ఎన్నిక వేళ వివాదంగా మార్చేశారు. ఈ అంశం తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలను ఏ విధంగా మలుపు తిప్పుతుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version