2018లో కన్నా లక్ష్మీనారాయణ ఆహ్వానం మేరకు బీజేపీలో చేరానని ఒ.వి.రమణ తెలిపారు. 3 రాజధానులపై పత్రికకు ఎడిటోరియల్ రాశాననే కారణంతోనే తనను సస్పెండ్ చేశారని ఒ.వి.రమణ ఆరోపించారు. రాజధాని అమరావతికి బీజేపీ అండగా ఉంటుందని కన్నా ప్రకటించారని..రమణ గుర్తుచేశారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధి అని జీవీఎల్ ప్రకటించారని తెలిపారు. హైకోర్టు వల్ల రాయలసీమకు లాభం లేదని టీజీ అన్నారని, రాజధాని రాష్ట్ర పరిధి అని సోము వీర్రాజు ప్రకటించారని, ఇవన్నీ కలిపి భాజపా తీరును వివరిస్తూ ఎడిటోరియల్ రాశానని ఒ.వి.రమణ తెలిపారు.
బీజేపీ.. అమరావతికి అనుకూలమా, ప్రతికూలమా చెప్పాలనడం తప్పా? అంటూ రమణ ప్రశ్నించారు. బీజేపీలో ఉంటూ పార్టీని తిట్టినవారు ఎవరూ కనిపించలేదా? అని గుర్తుచేశారు. కేంద్రం నుంచి అమరావతికి నిధులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాజధానిగా గుర్తించే కదా.. అమరావతికి కేంద్రసంస్థలు వచ్చాయని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా రాజధాని రైతులకు మద్దతిచ్చారని..మరి పవన్‌తోనూ పొత్తు వదులుకోండని సూచించారు.