చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని, బీజేపీతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు రాణి రుద్రమ. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో కూడా మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వమేనని, వరుసగా నాలుగు సార్లు ప్రవేశపెట్టి బిల్లు అమలు చేసింది కూడా బీజేపీయేనన్నారు రాణి రుద్రమ. పదేండ్లుగా బీజేపీ పార్టీ కమిటీల్లోనూ 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేసి చిత్తశుద్ధిని చాటిందని రుద్రమ గుర్తుచేశారు.
ఆర్థిక, విదేశీ వ్యవహారాల, రక్షణ లాంటి కీలక శాఖలను సైతం మహిళలకు కేటాయించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అలాగే 12 మందిని కేంద్ర మంత్రులుగా, 8 మందిని గవర్నర్లుగా, నలుగురు మహిళలను ముఖ్యమంత్రులను చేసిన ప్రభుత్వం బీజేపీయేనని ఆమె స్పష్టం చేశారు. దేశ చరిత్రలో తొలిసారి పారామిలిటరీ దళాల్లో సైతం మహిళలకు చోటు కల్పించింది మోడీ ప్రభుత్వమేనన్నారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపేసిన పార్టీలతో బీఆర్ఎస్ అంటకాగిందని మండిపడ్డారు. సొంత పార్టీలో ఏ ఒక్క కమిటీలోనూ బీఆర్ఎస్ మహిళలకు స్థానం కల్పించలేదని ధ్వజమెత్తారు.