ఆదిలాబాద్ లో అరుదైన గుడ్లగూబ..!?

-

ఆదిలాబాద్ ఈ జిల్లా పేరు వినగానే చాల మందికి గుర్తుకు వచ్చేది అడవి తల్లి అందాలు. ఇక సహజ అందాలకు నెలవైన ఆదిలాబాద్ లో ఎన్నో వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీరంగా పిలువబడుతుంది. ఈ జిల్లాలో దాదాపు 35 శాతం కంటే ఎక్కువగా అడవులే ఉంటాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉండే సెలయేళ్లు.. పచ్చిక బయళ్లలో సేద తీరడానికి ఎక్కడెక్కిడి నుంచో పక్షులు వస్తుంటాయి. కవ్వాల్ అభయారణ్యంలో అయితే.. తీరొక్క పక్షులు ఎన్నో దర్శనమిస్తాయి. ఇక క్రూర మృగాలకూ లెక్కేలేదు.

అయితే మొబైల్ టవర్ల కారణంగా కొద్దికాలంగా పక్షి జాతి అంతరించిపోతున్నది. గుడ్ల గూబ అయితే కనిపించడమే మానేసింది. ముఖం చాటేసిన గుడ్లగూబను ఇంటర్నెట్ లోనే వెతుక్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఒక అరుదైన గుడ్లగూబ కనిపించింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో వాలింది ఓ అరుదైన గుడ్లగూబ. కానీ దాని కాలికి గాయం కావడం అది వల్ల ఎగరలేని పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న అదే కాలనీకి చెందిన పక్షి ప్రేమికుడు లింగంపల్లి కృష్ణ అక్కడికి వెళ్ళి ఆ పక్షిని చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

ఇక విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది అహ్మద్ ఖాన్, శివ వచ్చి దాన్ని పశువైద్య శాలకు తీసుకువెళ్ళి వైద్యం చేయించారు. తిరిగి అక్కడి నుండి దాన్ని తీసుకొని వెళ్ళి జిల్లా అటవీ అధికారి డా. ప్రభాకర్ కు అందజేశారు. అటవీ సిబ్బంది ఆ గుడ్లగూబను తీసుకెళ్ళి ఆదిలాబాద్ శివారులోని మావల అడవిలో విడిచిపెట్టారు. దాంతో ఆ పక్షి స్వేచ్చగా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోయింది.

అయితే ఈ గుడ్లగూబ అరుదుగా కనిపించే ఇండియన్ రాక్ ఈగల్ అని, అటవీ ప్రాంతంలోని ఎత్తైన పర్వత శ్రేణుల్లో కనబడుతుందని అటవీ అధికారులు తెలిపారు. ఏది ఎమైన సురక్షితంగా ఆ అరుదైన పక్షిని అటవీ అధికారులకు అప్పగించిన పక్షి ప్రేమికుడు లింగంపల్లి కృష్ణను అధికారులు అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version