ఒడిశాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ ఎవరూ చూడని అరుదైన జాతి తాబేలు దర్శనమిచ్చింది. పసుపు రంగులో దగదగా మెరస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. వివరాళ్లోకి వెళితే..
బాలాసోర్ జిల్లాలోని సోరో బ్లాక్ లోని సుజన్ పూర్ గ్రామంలో ఈ వింత తాబేలు కనిపించింది. బంగారం పూత పూసినట్లు ఉన్న ఈ తాబేలు వెలుతురులో మెరిసిపోతుంది. ఆశ్చర్యానికి లోనైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. వైల్డ్ లైఫ్ వార్డెన్ భానుమిత్ర ఆచార్య ఈ తాబేలును చూసి ఇప్పటి వరకూ ఇలాంటి రంగులో తాబేలును చూడలేదని, ఇవి ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయన్నారు.
50 సంవత్సరాల వరకూ ఈ అరుదైన జాతి తాబేలు జీవిస్తాయని, దాదాపు 30 కిలోల వరకు బరువు పెరుగుతాయన్నారు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ట్రియంకిడియా జాతికి చెందిన తాబేళ్లు ఉన్నాయని, కానీ ఇప్పటి వరకూ పసుపు రంగులో ఉండి వెలుతురులో మెరిసే తాబేలు చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. ఇవీ చాలా అరుదైన జాతికి చెందినవిగా అభిప్రాయపడ్డారు భానుమిత్ర ఆచార్య.