ఏపీ సీఎంగా ఉన్న జగన్ తాను కొందరి వాడిని కాదు అని, అందరి వాడిని అని అని పదే పదే చెప్పుకుంటున్నారు. అందుకే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు కానీ, ఎక్కడా ఎటువంటి తారతమ్యం లేకుండా, పార్టీలకు అతీతంగా అందరికీ సక్రమంగా అందించే ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీల వారు బాగానే లబ్ది పొందుతున్నారు. ఎక్కడా వివక్ష కనిపించకుండా వలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్ని, అందరికి సక్రమంగా అందేలా ఏర్పాటు చేశారు. తాను కేవలం ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉండేందుకు రాలేదని, పది, పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని జగన్ ముందుగానే ప్రకటించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజా పరిపాలన చేస్తున్నారు.
ఈ విషయంలో మిగతా పార్టీలు జగన్ ను విమర్శించేందుకు అవకాశం దొరక్కపోవడంతో, ఆ అవకాశం కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇంతలోనే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైన సంఘటన మొదలు అక్కడి నుంచి ఏపీలో ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే వస్తోంది. దుర్గమ్మ ఆలయం రథానికి నాలుగు వెండి సింహాల ప్రతిమలు ఉండగా, మూడు అదృశ్యం అవ్వడం పైన వైసీపీ ప్రభుత్వం పై, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఇక తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా జరుగుతోంది… క్రిస్టియన్ అయిన జగన్ హిందూత్వంపైన ఉన్న ద్వేషంతో ఈ విధంగా హిందూ ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
బిజెపి, జనసేన, టిడిపి ఇలా అంతా మూకుమ్మడిగా జగన్ పై ఎదురు దాడి చేయడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. సంక్షేమ పథకాలతో, ప్రజా అభిమానంతో జగన్ ప్రజల్లోకి దూసుకు వెళ్ళిపోతుండడం, మరింత బలమైన నాయకుడిగా తయారవుతున్నాడనే కారణం, తమ రాజకీయ భవిష్యత్తు కు ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతుంది అనే ఉద్దేశంతో, జగన్ పై క్రిస్టియన్ ముద్రవేసి, హిందూ వ్యతిరేక శక్తిగా ఆయనను చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి జగన్ యాంటీ మీడియా కూడా సహకారం అందిస్తుండడంతో ఏపీలో ఏదో జరిగిపోతుందన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా కలుగజేస్తున్నారు.
వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వంలోనూ, తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం, హిందువులపై దాడులు, గుళ్ళు ధ్వంసం వంటివి జరిగాయి. అలాగే పుష్కరాల పేరుతో టిడిపి ప్రభుత్వంలో ఎన్నో గుళ్లను నేలమట్టం చేశారు. అయినా అప్పుడు రాని అభ్యంతరాలు, ఇప్పుడు తీవ్రస్థాయిలో వస్తుండడం వెనుక ఒక పథకం ప్రకారం జగన్ ను టార్గెట్ చేసుకుని, ఆ మతం ప్రజల ఓట్లను ఆయనకు దూరం చేసే విధంగా ప్లాన్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-Surya