కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (17-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఏపీలో కొత్తగా 8,702 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,01,462కు చేరుకుంది. 5,177 మంది చనిపోయారు. 88,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,08,088 మంది కోలుకున్నారు.
2. వచ్చే ఏడాది ఆరంభం వరకు దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 3 వ్యాక్సిన్లు కీలక దశల్లో ట్రయల్స్‌లో ఉన్నాయన్నారు.
3. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్‌కు కరోనా సోకింది. కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ క్రమంలో తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
4. ప్రపంచ జనాభాలో 13 శాతం జనాభా కలిగిన ధనిక దేశాలు ఇప్పటికే మొత్తం ఉత్పత్తి కానున్న కరోనా వ్యాక్సిన్‌లో సగం డోసులను కొన్నాయని ఓ నివేదికలో వెల్లడైంది. ఆక్స్‌ఫాం అనే సంస్థ ఆ వివరాలను వెల్లడించింది.
5. రష్యాకు చెందిన స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్ సురక్షితమేనని తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి 7 మందిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, కానీ అవి స్వల్పంగానే ఉన్నాయని గుర్తించారు. అందువల్ల తమ వ్యాక్సిన్ సేఫ్ అని రష్యా తెలిపింది.
6. తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరుకుంది. 1005 మంది చనిపోయారు. 1,33,055 మంది కోలుకున్నారు. 23,674 మంది చికిత్స పొందుతున్నారు.
7. దేశంలో కొత్తగా 83,230 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5.1 మిలియన్లు దాటింది. గత 7 రోజుల్లోనే 6,52,355 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 11,21,221 కరోనా కేసులతో మహారాష్ట్ర టాప్ ప్లేసులో కొనసాగుతోంది.
8. అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. జనవరి వరకు అక్కడి ప్రజలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారని సమాచారం.
9. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు 14,12,834 మందిని వందే భారత్ మిషన్ కింద భారత్‌కు తీసుకువచ్చామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.
10. కళ్లద్దాలను ధరించే వారు కోవిడ్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. చైనా సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు.