బాబు గుర్తుందా… ఈరోజు మానాన్న 70వ జయంతి?

-

బాబు బ్యాడ్ టైం ఏంటో తెలియదు కానీ… చిన్నా పెద్దా అనే తేడాలేమీ లేకుండా… దొరికినవారు దొరికినట్లుగా బాబుని వాయించేస్తున్నారు! చేసిన పనులు కూడా అలా ఉన్నట్లున్నాయి మరి!! ఆ సంగతులు అలా ఉంటే… ఆంధ్రప్రదేశ్ మాన్సాస్‌ ట్రస్ట్‌‌, సింహాచలం దేవస్ధానం చైర్‌ పర్సన్‌ సంచయిత గజపతిరాజు తాజాగా చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును నాయుడు తననే టార్గెట్‌ చేస్తున్నారని సంచయిత తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు తరచూ తనపై ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని.. అసలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మన్సాస్‌ కు చేసిందేమీ లేదని విమర్శించిన ఆమె.. మాన్సాస్‌ లో ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నాస్త్రాలు సంధించారు.

అలాగే.. 2016లో తన తండ్రి మరణించి నాలుగు రోజులు కూడా గడవక‌ముందే చంద్రబాబు ప్రత్యేక జీఓ ఇచ్చి బాబాయ్‌ అశోక గజపతిరాజును చైర్మన్‌ గా నియమించి ఎంతటి దారుణానికి ఒడిగట్టారో తెలిసిన విషయమని అన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు తనపై విమర్శలు ఎక్కుపెడుతోన్న సమయాన్ని ఆసరాగా చేసుకొని సంచయిత ఓ మీడియాతో ముచ్చటిస్తూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

“మా కుంటుంబంపై చంద్రబాబు నాయుడతో పాటు అశోక గజపతిరాజు రాజకీయ కుట్రకు దిగారు.. మాపై వారికి ఏమాత్రం అభిమానం ఉన్నా మానాన్న చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి చైర్మన్‌ పదవిపై నిర్ణయం తీసుకొనేవారు.. అలాంటివేమీ చేయకుండా నా తండ్రి వయస్సున్న బాబు.. తనపై తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉంది” అని స్పష్టం చేశారు సంచయిత. నిజానికి తనకు “సన ఫౌండేషన్” ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అనుభవం ఉందని.. గతంలో టీడీపీ నేతలకి నచ్చిన సంచయిత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైందని ప్రశ్నిస్తున్నారు. పురాతన మోతీ మహల్‌ ని పడగొట్టడానికి రాత్రికి రాత్రే టీడీపీ హయాంలో జిఓ ఇవ్వలేదా?.. విజయనగరంలో మూడు లాంతర్లు అభివృద్ది చేసే సమయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేయడం సమంజసమా అంటూ ఆమె విరుచుకుపడ్డారు.

అంతేకాకుండా మహిళగా తనకు అవకాశం రావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని స్పష్టం చేసిన సంచయిత… అసలు బాబు, ఓ మహిళగా తనకు అవకాశం రాకూడదని కోరుకుంటున్నారని.. ఎన్టీఆర్ హయాంలోనే పురుషులతో పాటు మహిళలకి సమాన అవకాశాలు కల్పించారని సంచయిత వెల్లడించారు. అంతటితో ఆగకుండా… ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేపట్టిన బాబుకు అవేం గుర్తుకు రావని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అలాగే.. తనకు సంబంధించిన ప్రతివిషయాన్నీ కూడా చంద్రబాబు, అశోక్ గజపతిరాజులు రాజకీయం చేయాలని చూస్తున్నారని…. మాన్సాస్‌ వ్యవహారాన్ని ట్రావెన్ కోర్‌తో ఎలా ముడిపెడతారని ఫైర్ అయ్యారు.

చివరగా మాన్సాస్, సింహాచలం దేవస్ధానంలో రాజకీయాలు తీసుకురాకండి అంటూ వారిని కోరుతున్నారు సంచయిత. ఇంకా చైర్ పర్సన్ ‌గా ప్రజలకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా “ఈరోజు నా తండ్రి దివంగత ఆనంద గజపతిరాజు 70వ పుట్టినరోజు అది కూడా వారికి గుర్తుండకపోవచ్చు” అంటూ సంచయిత గజపతి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version