నేడు ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధరని పోర్టల్ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించింది. ఈ కార్యక్రమం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాగింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల విలువైన భూములను టీఆర్ఎస్ కొల్లగొడుతోందని ఆరోపించారు. ధరణి సర్వరోగ నివారిణి అని కేసీఆర్ చెప్పారని, ధరణి పోర్టల్ పై టీ కాంగ్రెస్ అధ్యయనం చేసింది. అందులో చాలా సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ ముందే చెప్పిందని, ప్రాజెక్టులు, ఫార్మా సిటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల సమస్యలు సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
కన్న బిడ్డల కంటే రైతులు భూమిని ప్రేమగా చేసుకుంటారని, ఎప్పుడో అమ్ముకున్న వారి పేరు మళ్ళీ ధరణిలో వస్తుందని, ప్రభుత్వ తప్పిదం వల్ల ఎంతో మంది క్షణికావేశానికి లోనై మర్డర్ కేసులు మీద వేసుకోవాల్సి వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ధరణి ప్రారంభించిన లక్ష్మపూర్ లో వందల మంది రైతుల పేర్లు ధరణిలో నమోదు కాలేదని, ప్రభుత్వం పేద ప్రజల భూములను గుంజుకుంటుందని, కాంగ్రెస్ పంచిన 25 లక్షల ఎకరాల భూమిని ప్రజల నుంచి బలవంతంగా తీసుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. పేదలు కాదు ప్రభుత్వమే కబ్జాదారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.