తెలంగాణలో రాజకీయా రోజుకో రంగు పులుముకుంటుంది. 2024లు ఎన్నికలే లక్ష్యంగా.. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించేందుకు వచ్చిన షెకావత్… యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సభ నుంచి కేసీఆర్ సర్కారు తీరును విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. షెకావత్ ప్రస్తావించిన అంశాలపై స్పందించిన రేవంత్ రెడ్డి… కేంద్ర మంత్రికి పలు అంశాలపై ప్రశ్నలను సంధించారు.
ప్రధానంగా 3 అంశాల ఆధారంగా తెలంగాణ ఉద్యమం నడిచిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి… నీళ్లలో వాటా సాధించడం ప్రధాన లక్ష్యంగా చెప్పారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్ష నీళ్లేనని ఆయన తెలిపారు. కేసీఆర్ ను పెంచి పోషించినయ ప్రధాని మోదీ కాళేశ్వరం అవినీతిపై విచారణ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని కూడా రేవంత్ నిలదీశారు. కృష్ణా,గోదావరిలో తెలంగాణ నీటి వాటా ఎందుకు తేల్చడం లేదని కేంద్ర మంత్రిని ఆయన ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పనంతవరకు తెలంగాణ సమాజం బీజేపీని నమ్మదంటూ తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి.