తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. స్టాఫ్ నర్సులు అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ లేఖ రాశారు రేవంత్. తొలగించిన స్టాఫ్ నర్సులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఉన్న ఫళంగా ఉద్యోగాలు తొలగించి.. 1600 కుటుంబాలను రోడ్డున పడేశారని ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో దేవుళ్ళ తో పోల్చిన స్టాఫ్ నర్సులను… ఇవాళ రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రగతి భవన్ .. ప్రజల కన్నీళ్లు చూడవలసిన ముఖ్యమంత్రి కార్యాలయమా ? లేక కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయమా ? అంటూ కెసిఆర్ పై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. పదహారు వందల మంది స్టాఫ్ నర్సులను విధుల్లో తిరిగి కొనసాగించాలని ఈ మేరకు డిమాండ్ చేశారు.
1.91 లక్షల ఖాళీలు ఉంటే 50 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని అనడం దారుణమని మండిపడ్డారు. ఖాళీల భర్తీకి తక్షణమే షెడ్యూల్ ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కాగా ఇవాళ ఉదయం ఉద్యోగం కోల్పోయిన స్టాఫ్ నర్సులు.. రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.