తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరగడం కామన్ అని.. అయినా తామందరూ మళ్లీ కలిసిపోతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్లో చేతులే కాదు తమ మనసులు కూడా కలవాలని రేవంత్ పిలుపునిచ్చారు. పార్టీ ఇంతకంటే మెరుగైన స్థాయికి వెళుతుందని అనుకుంటే.. ప్రస్తుతం తనకున్న పదవి కూడా వదులుకుంటానని అన్నారు. పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడమే తన విధి అని తెలిపారు. పార్టీ శిక్షణా తరగతుల సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి .. పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయని.. నేతలు సర్దుకుపోవాలని సూచించారు. పది పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొర్లడం సహజమని అన్నారు. అందరూ మానవమాత్రులమే అని వ్యాఖ్యానించారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని అన్నారు. జానారెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామని చెప్పారు.
జానారెడ్డి సూచనలు, సలహలతో పార్టీని మూలమూలలకు తీసుకెళదామని అన్నారు. అపోహలు ఉండే 2023లో తొలగించుకుందామని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఏడాది నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ప్రజలకు నష్టం జరిగే చర్యలకు కాంగ్రెస్ పాల్పడదని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో తలమాసిన కొందరిని కేసీఆర్ బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని విమర్శించారు. ఏపీ ఆస్తులు, విద్యుత్ బకాయిల విషయంలో కేసీఆర్ ఎవరిపక్షమని ప్రశ్నించారు.