ఆడిబిడ్డలకు అన్ని రంగాలకు ప్రాతినిధ్యం కల్పించి కోటీశ్వరులను చేస్తామని బుధవారం యువ వికాసం సభలో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ అర్ధరాత్రి ఆడబిడ్డలను లాఠీలతో కొట్టించిన నువ్వు వారిని కోటీశ్వరులను చేస్తావా? రేవంత్ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు నిన్ను నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.
‘హైడ్రా’తో బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్నారని.. మూసీలో ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేస్తున్నారని, పేదింటి ఆడబిడ్డల పెండ్లి కానుకలకు కత్తెర పెట్టారని ఆక్షేపించారు. నిండు గర్భిణీల న్యూట్రీషన్ కిట్‌ను కూడా మాయం చేశారని,పేదింటి మహిళల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడిని కాంగ్రెస్ సర్కార్ ఎత్తేసిందని పేర్కొన్నారు.ఎన్నికల సందర్భంగా తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను వంచించారన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామంటూ చెవిలో పువ్వులు పెట్టారని, పింఛన్లను రూ.4 వేలను పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఫైర్ అయ్యారు. ‘బతుకమ్మ చీరలను బందువెట్టిన నువ్వు.. మహిళలను కోటీశ్వరులను చేస్తావా? అని కేటీఆర్ ప్రశ్నించారు.‘నీ డమ్మీ పథకాలు గడపలు దాటవు కానీ.. నీ మాటలు కోటలు దాటుతున్నాయి’ అని చురకలంటించారు.