ఢిల్లీలో భారీగా కోవిడ్ రూల్స్ ఉల్లంఘ‌న‌లు.. 3 నెల‌ల్లో రూ.2.53 కోట్ల ఫైన్లు వ‌సూలు..

-

క‌రోనా నేప‌థ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ప‌లు ప్ర‌త్యేక‌మైన కోవిడ్ రూల్స్‌ను విధించి అమ‌లు చేస్తున్నాయి. ఎక్క‌డికి వెళ్లినా మాస్క్ ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్ట‌న్స్ పాటించ‌డం కామ‌న్ అయిపోయింది. అన్ని రాష్ట్రాలు ఈ రూల్స్ ను ఉల్లంఘించిన వారిపై పెద్ద ఎత్తున జ‌రిమానాలు విధిస్తున్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం గ‌త 3 నెల‌ల కాలంలో కోవిడ్ రూల్స్ ను భారీ ఎత్తున ఉల్లంఘించారు. దీంతో పోలీసులు భారీగా ఫైన్ల‌ను కూడా వ‌సూలు చేశారు.

జూన్ 13 నుంచి ఇప్ప‌టి వ‌రకు ఢిల్లీలో కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారికి అంద‌జేసిన చ‌లాన్ల సంఖ్య 51,600కు చేరుకుంది. ఈ క్ర‌మంలో ఆ చ‌లాన్ల ద్వారా మొత్తం రూ.2.53 కోట్ల ఫైన్ల‌ను వ‌సూలు చేశారు. ఆ మొత్తంలో రూ.1.19 కోట్ల‌ను గ‌త 8 రోజుల్లోనే వ‌సూలు చేయ‌డం విశేషం. సెప్టెంబ‌ర్ 20 నుంచి 27వ తేదీ వ‌ర‌కు రూ.1.19 కోట్ల ఫైన్ల‌ను కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు గాను వ‌సూలు చేశారు. అంటే.. రాను రాను అక్క‌డి జ‌నాల్లో నిర్ల‌క్ష్యం పెరిగిపోయింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అందువ‌ల్లే వారికి విధించే ఫైన్ల మొత్తం కూడా భారీగా పెరుగుతోంది.

ఇక ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 182 ప్ర‌త్యేక బృందాల‌ను కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు ఏర్పాటు చేశారు. వారిలో పోలీసులే కాకుండా వాలంటీర్లు కూడా ఉన్నారు. వారు ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌టిస్తూ కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిని గుర్తించి వారికి చ‌లాన్లు విధిస్తారు. ఇక 3 నెల‌ల కాలంలో మొత్తం 27,678 మంది కోవిడ్ రూల్స్ ను పాటించ‌లేద‌ని వారిని అరెస్టు చేయ‌డం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉన్న‌ప్పుడు మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డం, సోష‌ల్ డిస్ట‌న్స్ పాటించ‌క‌పోవ‌డం, ఉమ్మి వేయ‌డం, అధిక సంఖ్య‌లో ఒకే చోట గుమిగూడ‌డం, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటి వాటిని ఢిల్లీలో కోవిడ్ రూల్స్ ఉల్లంఘ‌న‌ల కింద నిర్దారిస్తున్నారు. ఆయా ప‌నులు చేసిన వారికి ఫైన్లు వేస్తున్నారు. మాస్కుల‌ను ధ‌రించ‌క‌పోతే రూ.500 ఫైన్ వ‌సూలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version