కరోనా నేపథ్యంలో గతేడాది కేంద్రం ఆరోగ్య సేతు యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైలు, విమాన ప్రయాణికులు ప్రస్తుతం దీన్ని తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోంది. కరోనా వచ్చిన వారి నుంచి సురక్షితంగా ఉండేందుకు, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటించేందుకు, ఒక ప్రాంతంలో ఎంత మంది కోవిడ్ బారిన పడ్డారు, ఎందరికి కరోనా సోకింది, ఎన్ని కేసులు ఉన్నాయి.. అనే వివరాలను తెలుసుకునేందుకు ఆ యాప్‌ను ప్రవేశపెట్టారు. అయితే తాజాగా సైంటిస్టులు కోవిడ్‌ను గుర్తించేందుకు గాను ఏకంగా ఇంకో వైరస్‌నే సృష్టించారు. అయితే అది జీవించి ఉండే వైరస్ కాదు. వర్చువల్ వైరస్.
అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, యూఎస్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లకు చెందిన సైంటిస్టులు సంయుక్తంగా కలిసి సేఫ్ బ్లూస్ అనే వర్చువల్ వైరస్‌ను సృష్టించారు. ఇది ఫోన్‌లో ఉంటుంది. బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. ఈ వర్చువల్ వైరస్ అసలైన కోవిడ్ వైరస్‌ను కనిపెడుతుంది. అలాగే సామాజిక దూరం నిబంధన పాటిస్తున్నారా, లేదా అనేది చెబుతుంది.
ఇక ఈ వర్చువల్ వైరస్ పెద్ద ఎత్తున జన సమూహం ఉన్న చోట్లను కూడా గుర్తిస్తుంది. అక్కడి వారిని అలర్ట్ చేస్తుంది. దీంతో కోవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ వైరస్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలను సైంటిస్టులు వెల్లడించనున్నారు.