కొన్నాళ్లుగా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడం తనకిష్టం లేదని అన్నారు. మనసు ఒక చోట, శరీరం మరో చోట కష్టమైన పని అని అభిప్రాయపడ్డారు. అయితే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ.. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన అన్నారు. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటామన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ లను కాదని ఆయన తెలిపారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని ఆయన అన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ గా ఇంకా ఎవరినీ నియమించ లేదని, కొంత మందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు తెలుసు అని సజ్జల వ్యాఖ్యానించారు.