ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0” లో పాల్గొన్నారు. అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు.
వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని.. ఆ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు. నా అభిమానులంతా విధిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆద్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ.. పెద్ద మనసుతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు.