ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ భారత్‌లోని తన కస్టమర్ల కోసం కొత్తగా ఓ రిఫరల్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. శాంసంగ్ రిఫరల్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ప్రోగ్రామ్, షాప్ 20కె అడ్వాంటేజ్ ఇనిషియేటివ్. వీటి ద్వారా వినియోగదారులు శాంసంగ్ ఉత్పత్తులపై రివార్డులు, రిఫరల్స్ నగదు, షాపింగ్ వోచర్లు పొందవచ్చు.
శాంసంగ్ రిఫరల్ ప్రోగ్రామ్ కింద ఎవరైనా సరే శాంసంగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారికి రిఫర్ చేస్తే ఆయా ఉత్పత్తులపై 8 శాతం వరకు రివార్డులను అందిస్తారు. అలాగే శాంసంగ్ ఉత్పత్తులను కొన్నాక రిఫరల్‌కు రూ.1500 వరకు ఇస్తారు. ఇలా రిఫరల్ ప్రోగ్రామ్ కింద ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, వియరబుల్స్, ఇతర శాంసంగ్ ఉత్పత్తులు అన్నీ కలిపి మొత్తం 15 విభాగాలకు చెందిన ఉత్పత్తులను రిఫర్ చేసి వాటి కొనుగోళ్లపై ఇలా రివార్డులు, నగదు పొందవచ్చు. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు.
ఇక స్టూడెంట్ ప్రోగ్రామ్‌లో కేవలం విద్యార్థులు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా వారు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, వియరబుల్స్, యాక్ససరీలు తదితర ఉత్పత్తులపై తగ్గింపు ధరలను పొందవచ్చు. అలాగే ఇన్సూరెన్స్‌ను ఉచితంగా అందిస్తారు. ఈజీ ఎక్స్‌ఛేంజ్ సదుపాయం ఉంటుంది. సులభతరమైన ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. ఇందులో పాల్గొనేందుకు విద్యార్థులు తమ అధికారిక కాలేజీ మెయిల్ ఐడీ లేదా స్టూడెంట్ ఐడీ కార్డు, ఇతర పత్రాలతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
చివరిగా షాప్ 20కె అడ్వాంటేజ్ ఇనిషియేటివ్‌లో శాంసంగ్ షాప్ యాప్ ద్వారా వినియోగదారులకు రూ.20వేలు విలువ చేసే మొత్తం 10 షాపింగ్ వోచర్లను అందిస్తారు. ఒక్కో వోచర్ విలువ రూ.2వేలు ఉంటుంది. ఒక్కో వోచర్‌తో వినియోగదారులు శాంసంగ్‌కు చెందిన ఒక్కో విభాగంలోని ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అంటే ఒక వోచర్‌ను శాంసంగ్ ఫోన్‌కు ఉపయోగిస్తే.. మరొక వోచర్‌తో శాంసంగ్‌కు చెందిన ట్యాబ్లెట్లు, టీవీలు లేదా వాచ్‌లు తదితర ఏదైనా ఇతర విభాగానికి చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చన్నమాట. అలా మొత్తం 10 వోచర్లను ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఆ వోచర్లకు 365 రోజుల పాటు వాలిడిటీని అందిస్తున్నారు.